అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చించేందుకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. అలాగే కొద్దిసేపటి క్రితం ముగిసిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన కీలక బిల్లులను సైతం ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. సమావేశాల నేపథ్యంలో స్వీకర్ అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ బీఏసీ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది.
సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బీఏసీ నిర్ణయం తీసుకుంది. అలాగే వీటిపై సుదీర్ఘంగా చర్చించేందుకు మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ సమావేశంలో సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణను టీడీపీ వ్యతిరేకించినట్లు తెలిసింది. రాష్ట్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తారా..? అని టీడీపీపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. (హై పవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం)